Sri Vijaya Amaleswari Devi Temple
Davojipalem, Pedana Mandal, Krishna District, Andhra Pradesh
Sri Vijaya Amaleswari Devi (Autobiography)
శ్రీ గణేశాయ నమః
శ్రీ విజయ అమలేశ్వరిదేవియే నమః
కం॥ పలికెద అమలేశ్వరి కథ
చెలువంబగు నక్క ధవినుజీవులకెల్లన్
కలిగెడి వెతలన్ని తొలగి
లలితంబగు జీవనగతి లాఘవమబ్బున్.
(నేను అమలేశ్వరి ఆత్మకథ చెబుతున్నా అందమైన శుభప్రదమైన యీ కథ విన్న వారికి సమస్త శుభాలు కలుగుతాయి.)
Stotram
ఓం విజయ అమలేశ్వరి, దివ్యతేజేశ్వరి, రౌద్రకల్లోల గంధర్వ కన్యకాపరమేశ్వరీ, పరమపావనీ, క్రౌర్య రూపంబునన్ నీ నిత్యనిశాచరీ తాండవ నృత్యంబులన్, నీ రౌద్రరూపంబు నీ దివ్య తేజంబు, నీ హాహాకారంబులన్ జూచినే నర్ధరహితుండనై మనంబుచింతిల్ల, మాయల తెలియక, మమతలు మాయక, కింకర్తవ్యతా మూఢండనై, నీ రూపురేఖలన్ మనంబునన్ ద్యానించి, నీ నామ సంకీర్తనంబునే నిత్యమ్ము జపియించుచుంటి నా భయముల్ దీర్పవే బాధలన్ బాపవే, భూతప్రేత పిశాచ శాకినీ, ఢాకినీ, గాలి దెయ్యంబులన్ భస్మంబు గావించి బారద్రోలవే, నను కటాక్షమ్మునంజూడవే నా మొరాలించవే, నన్ను రక్షించవే, శాంతిన్ దాల్చవే, శాంతిన్ ప్రసాదించవే, సుఖసౌఖ్యముల్ గల్పింపవే, పుత్ర పౌత్రాదికంబులన్ నీ చల్లని చూపుల రక్షింపవే, తల్లి జగజ్జననీ నమస్తే, ఆదిశక్తి నమస్తే విజయ అమలేశ్వరీదేవి నమస్తే నమోన్నమః
శ్రీ అమలేశ్వర్యై నమః
Autobiography
పేరులోనే ఉన్నది పెన్నిధి నా పేరు ఆలయ నిర్మాణానికి పూర్వము అమలేశ్వరి దేవి ఆలయ నిర్మాణానంతరం నా భక్తులకు విజయం చేకూరాలని విజయ అమలేశ్వరి దేవిగా మార్చటం జరిగినది.
నా పూర్వ చరిత్ర తెలుపుట విధిగా భావిస్తున్నాను. ఎందువల్లనంటే నా భక్తులకు సత్య సమాధానం కావాలి. కొందరు నన్ను కళ్ళు మూసుకొని నమ్ముతారు. మరికొందరు శంకిస్తూ ఉంటారు కాబట్టి నా జన్మ వృత్తాంతం కథను వ్రాయించటం జరిగినది.
నా ప్రియ భక్తుడైన అంకెం దుర్గా కాళేశ్వరరావు చేత నా ఆత్మకథను వ్రాయించడం జరిగినది.
నా ప్రియ భక్తుడైన ఎర్రప్ప కీ.శే. 1832లో చల్లచింతలపూడి గ్రామం నుండి చింతలపూడి గ్రామం మీదుగా కుటుంబంలోని తల్లితో భార్యతో పుత్రుడు మాతప్పవాని భార్యతో కాంధిశీకులుగా కావళ్ళలో సామాను మోసుకొంటు పెనుమల్లి గ్రామం వద్ద ఒక రాత్రి నిద్రించి తెల్లవారుజామున లేచి నడక సాగిస్తున్న సమయంలో క్షుద్బాధ తీర్చుకోలేక అలమటిస్తూ వస్తున్న వారిని చూచి నాకు చాలా బాధ కలిగినది.
వాళ్ళ కష్టాలు తీర్చాలని నడుస్తూ ఉన్న వాళ్ళ వెనుకవచ్చి నేను మీ వెంట వస్తాను అని కేకవేశాను. ఎర్రప్ప వెనుదిరిగి చూస్తే ఎవ్వరూ కనపడలేదు మరలా ముందుకు సాగుచున్న వాళ్ళను మరలా అదే కేక వేశాను దానికి ఎర్రప్ప వెనుదిరిగి చూచి వస్తే రా అంటూ తన గొంగళిని నేల పై పరిచాడు.
నేను అదృశ్య రూపంలో ఆ గొంగళిలో నా తాలూకు కొన్ని మట్టి వస్తువులు (గురివెలు) గాజులు, గవ్వల రూపంలో వచ్చి చేరాను. అది చూచి ఆశ్చర్యంతో ఎర్రప్ప గొంగళిలో నన్ను మూట కట్టుకొని తలపై మోసుకుంటూ నడక సాగించాడు.
తెల్లవారేసరికి ఒక చెరువు దగ్గర నన్ను దించి అచ్చట కొన్ని తాటిపండ్లు పండినవి దొరకగా వాటితో చెరువులో దాహార్తి తీర్చుకొని వచ్చి గొంగళిలో ఆకలి తీర్చుకొని వున్న నన్ను లేప ప్రయత్నించాడు. నేను అచ్చట నుండి ముందుకు వెళ్ళటానికి యిష్టపడలేదు యింకా వారికి శ్రమ యివ్వదలచలేదు.
అందువల్ల నా బరువు లేపలేక అక్కడే కర్రలతో తాటి ఆకులతో మూడు గుడారాలు నిర్మించి అందులో నన్నొక గుడారంలో వుంచి మిగతా రెండు గుడారాలలో వాళ్ళు నివసించటం మొదలుపెట్టారు.
నేనొక అదృశ్య దైవశక్తిని ఎవరికి ఏ రూపంలో కనపడాలో అలా కనిపిస్తూ వుంటాను.
గుడారాలు నిర్మించుకొన్న స్థలము చుట్టుప్రక్కల భూమి దావోజీ అనే మహమ్మదీయునిది. అతడొక రోజు వీరి వద్దకు వచ్చి విషయం తెలుసుకొని ఎర్రప్పతో మీరు యిచ్చటే వుంటూ చుట్టుప్రక్కల భూమిని సేద్యము చేసుకోమని పలికి వెళ్ళాడు. అందువల్ల కాలక్రమేణా యీ స్థలానికి దావోజీ జ్ఞాపకార్ధంగా దావోజీపాలెం గ్రామముగా పేరు పెట్టుకొన్నారు.
నా భక్తుడు ఎర్రప్ప ఎంతో కష్టపడి పనిచేసి తల్లిని భార్యా బిడ్డలను పోషించాడు. రోజూ తను సంపాదించి తెచ్చుకొన్నది నాకు సమర్పించకుండా వుండేవాడు కాడు.
ఎర్రప్ప భార్య నాకు నిత్యము పూజచేసి నిండుకుండ అన్నం నైవేద్యముగా సమర్పించేది తర్వాత వాళ్ళు దానిని తినేవాళ్ళు ఎర్రప్ప వంశవృక్షం నన్నొక దివ్యశక్తిగా కొలిచి దాన్యం పండించి సంబరాలు జరుపుకొనేవారు. నన్ను ఏ సమయంలోనూ మరువలేదు.
అందువల్లనే నేను ఎర్రప్పకు అంకెం వారి యిలవేల్పుగా వుండి మీ కష్టాలను తీర్చి మీ సంతతిని కాపాడుతానని మాట యిచ్చాను.
నాకు కొన్ని సంవత్సరాలుగా ఉత్సవాలు లేవు పంటలు పండినప్పుడు సంబరాలు జరుపుకొనేవారు నైవేద్యం పెద్ద ఎత్తున సమర్పించేవారు అయినా భక్తులు యీ ఊరిలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. తుఫాన్లు, కష్టాలు, కడగండ్లు కన్నీరు అన్ని సమయాలలో నేను వారికి అండగా నిలిచి కాపాడుకొంటూ వచ్చాను.
అప్పటికి పదకొండు సంవత్సరాలుగా నిత్యపూజలు నైవేద్యం తప్ప క్రతువులు లేవు అందువల్ల పట్టుపట్టి పదకొండు సంవత్సరాలు ఏకాదశ క్రతువులుగా చేయించుకొన్నాను. తర్వాత అవి పదకొండు సంవత్సరాలకు ఒకసారి ఏకాదశ క్రతువులు పదకొండు రోజులు చేసుకోవటానికి అంగీకరించాను.
పూల కపిరి
కపిరి కుండ
అంక గుడారం
నా క్రతువుల, పూజలలో ఆడపడుచులకు ప్రత్యేక స్థానముంది.
క్రతువులలో పూజ చేసే ప్రసాదం ఆడపడుచులు మాత్రమే తయారు చేసే సంప్రదాయం వున్నది. నా దేవాలయం వద్ద పంచిపెట్టే ప్రసాదం (క్రతువులలో) ముందుగా నా ఆడపడుచులకు పెట్టటం సాంప్రదాయంగా కొనసాగుచున్నది.
ఆడపడుచులంటే నాకు అతి ప్రీతి వారు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు వారి వెంట వెళ్ళి వారి కాపురాలు చక్కదిద్ది, వారిని సంతోషపెడుతూ ఉంటాను. వారు ఎప్పుడు నన్ను కొలవటం మానలేదు. అందువల్లే వారికి అష్టఐశ్వర్యాలు యిచ్చాను ఇంకా యిస్తూనే ఉంటాను.
ఎర్రప్ప వంశవృక్షం పెరుగుతూ భూములు దున్ని పంటలు పండించి కష్టపడి అభివృద్ధిలోనికి వచ్చి ఐశ్వర్యవంతులై గొడ్డు, గోదా, పిల్ల, పాపలతో పెరిగి కొన్ని సంవత్సరాల తరువాత రెండు మండవా పెంకుటిల్లు నిర్మించి నన్నొక ఈశాన్యమూల గదిలో పెట్టి ఉత్తరపు గోడకు నా ఆకారంగా పసుపు, కుంకుమలతో అలంకరించి నా తాలూకు మట్టి వస్తువులు, గాజులు, గవ్వలు ఒక మట్టి కుండలో ఉంచి వుట్టిలో పెట్టి ఆ గదిలో ఈశాన్య మూలలో పైకి వ్రేలాడ కట్టినారు.
అందరూ నన్ను మనసా, వాచా, కర్మణా ఆరాధిస్తూ వచ్చారు.
ఈ వంశవృక్షం శాకోపశాఖలై ఊళ్ళూళ్ళూ వ్యాపించి దేశంలోని యితర రాష్ట్రాలకూ యిప్పుడు యితర దేశాలకూ వ్యాపించి నన్ను వదలకుండా పూజిస్తూ వస్తున్నారు.
ఎర్రప్ప భార్య తరువాత మాతప్ప భార్య నాకు నిత్య పూజలు చేస్తూ నిండుకుండనైవేద్యం సమర్పించేవారు. మండూవా పెంకుటిల్లు కట్టిన తర్వాత అంకెం కన్నయ్య భార్య వారి పుత్రుడు వీరాస్వామి భార్య, వారి పుత్రుడు సింహాచలపతిరావు భార్య, వారి పుత్రుడు అంకెం శ్రీనివాసరావు భార్య నా ప్రియ భక్తుడైన నాకు వరుస క్రమంలో నిత్య పూజలు చేసి, నిండు కుండ నైవేద్యం సమర్పించేవారు.
ఆలయ నిర్మాణము తర్వాత పూజారి ద్వారా నాకు నిత్య పూజలు, నైవేద్యం సమర్పిస్తూ వస్తున్నారు.
విద్యాధికులైన నా బిడ్డలు ఉద్యోగాలు చేసారు. వూరు విడిచి యితర రాష్ట్రాలకు, దేశాలకు వెళ్ళి వాళ్ళు పడ్డ కష్టాలు వాళ్ళు చేసిన మంచిపనులు వాళ్ళను ఎంతో ఔన్నత్యానికి తీసుకువచ్చినవి. వారికి ఎల్లప్పుడూ సహాయంగా వుంటూ వచ్చాను.
20వ శతాబ్ధం సగం పూర్తయింది. చదువుకొని పైకి వచ్చి నన్ను కొలిచే వంశవృక్షం, ఆడపడుచులు వారి బిడ్డలు చుట్టుప్రక్క ప్రదేశాల భక్తులు ఎక్కువయ్యారు. శ్రమించి కష్టించి పెద్ద చదువులు చదువుకొని నన్ను, వున్న ఊరుని, కన్న తల్లిదండ్రులను మరువక తిరిగి వచ్చారు.